వాషింగ్టన్: ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో ఏర్పాటు చేసిన సముద్రపు మైన్లను తొలగించినట్లు అమెరికా ప్రకటించింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లు ఏర్పాటు చేసిందని, వాటి కారణంగా అంతర్జాతీయ నౌకాయానానికి తీవ్ర ముప్పు ఏర్పడిందని అమెరికా పేర్కొంది. ఈ మైన్లను గుర్తించి తొలగించేందుకు అమెరికా నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. నౌకాదళ సిబ్బంది, డైవర్లు, ప్రత్యేక బలగాలు, విమానాలు, అండర్‌వాటర్ డ్రోన్ల సహాయంతో హార్ముజ్ జలసంధిలో మైన్ల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. గుర్తించిన మైన్లను తొలగించడం లేదా నియంత్రిత పద్ధతిలో పేల్చివేయడం ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రధాన నౌకాయాన మార్గాలను సురక్షితం చేశారు.
ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 1,500 వాణిజ్య నౌకలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు వీలు కల్పించినట్లు అమెరికా వెల్లడించింది. ప్రస్తుతం నౌకల రాకపోకలకు అవసరమైన మార్గాలను క్లియర్ చేసినప్పటికీ.. జలసంధి పూర్తిగా సురక్షితంగా మారిందని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ మరోసారి మైన్లు ఏర్పాటు చేయడం, డ్రోన్లు లేదా ఇతర మార్గాల్లో దాడులు చేసే ముప్పు ఇంకా కొనసాగుతోందని అంచనా వేస్తున్నారు.
ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ఈ మార్గంలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే హార్ముజ్ జలసంధిలో పరిస్థితులను అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
మరోవైపు.. హార్ముజ్‌లో మళ్లీ సముద్రపు మైన్లు ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దీంతో మైన్ల తొలగింపు తర్వాత హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వస్తాయా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.


