టిబెట్ సరిహద్దు సమీపంలో హిమాలయాల్లో హిమానీనదం కూలిపోవడంతో అనేక గ్రామాలు ధ్వంసమై, భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాదం నుంచి కోలుకోకముందే ఇప్పుడు భోటే కోశి నది నుంచి మరో ప్రమాదం పొంచి ఉంది.
“భోటే కోశి నదిలో వరద ప్రవాహం పెరిగిన శబ్దాలు వినిపించినట్టు రసువా జిల్లా పరిపాలన కార్యాలయానికి సమాచారం అందింది” అని ఎన్డీఆర్ఆర్ఎంఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ సమాచారం మేరకు రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. నది చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తదుపరి సమాచారం అందిన వెంటనే మరిన్ని వివరాలు అందిస్తామని తెలిపింది.
కొద్దిసేపటికే ఎన్డీఆర్ఆర్ఎంఏ మరో పోస్ట్ చేసింది. భోటే కోశిలో వరద ప్రవాహం మరింత పెరిగినట్లు నివేదికలు అందుతున్నాయని, అందువల్ల సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. “రసువాలోని భోటే కోశి నదిలో వరద ప్రవాహం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ సహా ప్రభావిత ప్రాంతాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమైన సిబ్బంది, నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని విజ్ఞప్తి చేసింది. ఈ ఆకస్మిక పరిణామంతో నేపాల్ అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. సహాయక బృందాలను అప్రమత్తం చేస్తూ, నష్టం జరగకుండాచర్యలు ముమ్మరం చేసింది


