హైదరాబాద్: విధి నిర్వహణలో బిజీగా ఉండే తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రీడల్లోనూ తన ప్రతిభను చాటుతున్నారు. తాజాగా క్రికెట్ మ్యాచ్‌లో బ్యాట్‌తో వీరవిహారం చేసి ఏకంగా 126 పరుగులతో అజేయ శతకం సాధించారు.
సికింద్రాబాద్ క్లబ్ మైదానంలో హైదరాబాద్ జట్టుతో జరిగిన ‘సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్షిప్’ మ్యాచ్‌లో సీవీ ఆనంద్ ఓపెనర్‌గా బరిలోకి దిగారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. 82 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్లతో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఆయన ధాటికి సికింద్రాబాద్ క్లబ్ జట్టు 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సీవీ ఆనంద్ సత్తా చాటారు. 5 ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
క్రికెట్‌పై చిన్ననాటి నుంచే ఆసక్తి ఉన్న సీవీ ఆనంద్ విద్యార్థి దశలోనే అండర్-22 జట్టుకు ఎంపికయ్యారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున పలు మ్యాచ్‌ల్లో పాల్గొంటూ తన క్రీడా ప్రతిభను కొనసాగిస్తున్నారు. 2019లో అఖిల భారత టెన్నిస్ టోర్నీలోనూ ప్రథమ స్థానం సాధించారు. గోల్ఫ్ టోర్నమెంట్లలోనూ పాల్గొంటూ క్రీడలపై తన ఆసక్తిని చాటుతున్నారు.