పారిశ్రామికవేత్తపై సంచలన ఆరోపణలు.. అరెస్ట్

చెన్నై: బాలికలను వ్యభిచారంలోకి దింపి, వారితో లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గతేడాది ఓ సామాజిక కార్యకర్తకు గుర్తుతెలియని వ్యక్తి పెన్డ్రైవ్ అందజేశారు. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త వీరమణి ఓ బాలికతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృశ్యాలు ఉన్నట్లు ఆరోపించారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తేనాంపేటలోని ఓ ఇంటిని వీరమణి అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంటి నిర్వహణ బాధ్యతలను శాంతి, ఆమె భర్త మహేంద్ర సింగ్లకు అప్పగించినట్లు తేలింది. వారి ద్వారా పలువురు బాలికలను అక్కడికి తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం శాంతి, మహేంద్ర సింగ్ నివాసాలు, కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాలికలు, మహిళలకు సంబంధించిన ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో శాంతి, మహేంద్ర సింగ్తో పాటు పారిశ్రామికవేత్త వీరమణిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.