నిజామాబాద్: బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తనపై జరిగిన పరిణామాలకు ప్రశాంత్‌రెడ్డే ప్రధాన కారణమని ఆరోపించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సభలో ఆమె మాట్లాడిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయకున్నా తనపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి కేసీఆర్‌కు తనను దూరం చేయడంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని ఆరోపించారు. తనను కేసీఆర్ కుమార్తెలా చూసుకునేవారని, అయితే ప్రశాంత్‌రెడ్డి తమ కుటుంబం మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించారని విమర్శించారు.
“హైదరాబాద్‌లో, నల్గొండలో కుమ్మేస్తున్నావు గానీ.. ప్రశాంత్‌రెడ్డిని మాత్రం కుమ్మించను. ఆయనకు నా ఊరు తగులుతుంది” అంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిన రెండో రోజే ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యే క్రమంలో నెల రోజుల పాటు అమెరికాలో ఉండి వేమ్ నరేందర్‌రెడ్డితో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు.
‘ప్రశాంత్‌రెడ్డికి ప్రజా జీవితం లేదు’
ప్రశాంత్‌రెడ్డికి ప్రజా జీవితం లేదని కవిత విమర్శించారు. ఆయన బాల్కొండ నుంచి పారిపోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రశాంత్‌రెడ్డి వైఖరి “పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉంది” అని ఎద్దేవా చేశారు.
తాను ప్రశాంత్‌రెడ్డి మంత్రి కావడానికి ఎంతో ప్రయత్నించానని కవిత తెలిపారు. అలాగే ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యేలను గెలిపించేందుకు తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు. అయితే చివరకు వారందరూ తనకు అన్యాయం చేశారని, తనను పరాజితురాలిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఏ తప్పు చేయకున్నా జైలులో పెట్టారు’
తాను ఎలాంటి తప్పు చేయకున్నా తిహార్ జైలులో పెట్టారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కోడలిగా ప్రజల కోసం, ఉద్యమాల కోసం పనిచేసిన తనకు చివరకు నాలుగేళ్ల జైలు శిక్ష వంటి పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రశాంత్‌రెడ్డిపై ఆమె నేరుగా విమర్శలు చేయడం, గతంలో తనకు ఆయనతో ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.