మహిళలకు దక్కిన గౌరవం: గద్వాల విజయలక్ష్మి

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (సమాచార హక్కు): రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్‌గా, క్యాబినెట్ మంత్రి హోదాలో గద్వాల విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు.
ప్రజాభవన్‌కు చేరుకున్న విజయలక్ష్మికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ సంబంధిత ఫైల్‌పై ఆమె సంతకం చేశారు. అనంతరం సీఎం ప్రజావాణి హాల్‌ను పరిశీలించి, ప్రజావాణి కార్యక్రమం అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్ పదవిని ఒక మహిళ చేపట్టలేదని తెలిపారు. తొలిసారిగా ఒక మహిళకు ఈ బాధ్యతలు అప్పగించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
ఈ పదవి తనకు వ్యక్తిగతంగా లభించిన గౌరవంగా మాత్రమే భావించడం లేదని, రాష్ట్రంలోని మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు లభించిన గుర్తింపు, ప్రోత్సాహంగా భావిస్తున్నానని చెప్పారు. పరిపాలనలో, నిర్ణయాలు తీసుకునే స్థాయిలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే బలమైన సందేశాన్ని ఈ నియామకం ఇస్తోందన్నారు.
రాష్ట్రంలోని మూడు కీలక పదవుల్లో మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా సాధికారత, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న విషయం స్పష్టమవుతోందని విజయలక్ష్మి అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కే.సి. వేణుగోపాల్, కుమారి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. తెలంగాణ రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేందుకు నా వంతు కృషి చేస్తాను. ఈ పదవిని కేవలం గౌరవంగా కాకుండా ఒక బాధ్యతగా భావించి ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తాను” అని విజయలక్ష్మి తెలిపారు.
పలువురు ప్రముఖుల హాజరు
విజయలక్ష్మి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కే. కేశవరావు, వి. హనుమంతరావు, మహ్మద్ అలీ షబ్బీర్, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, డాక్టర్ రోహిన్ రెడ్డి, మధు యాస్కి గౌడ్, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, పి. అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఈరావత్రి అనిల్, మెట్టు సాయి కుమార్, నూతి శ్రీకాంత్ గౌడ్, ఫయీమ్ ఖురేషి, అజ్మాతుల్లా హుస్సేని, గుత్తా అమిత్ రెడ్డి, చరణ్ కౌశిక్ యాదవ్, ఎన్ఆర్ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ, మహిళా కాంగ్రెస్ నాయకురాలు అనితా రావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, ప్లానింగ్ శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కే. విద్యాసాగర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.