కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్రింటింగ్ పరిశ్రమలో ఎగసిపడిన మంటలు

హైదరాబాద్,సెప్టెంబర్ 8 (సమాచార హక్కు): కూకట్పల్లి ప్రశాంత్నగర్ పారిశ్రామికవాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ఏబీసీ ప్రింటింగ్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు, పరిసర పరిశ్రమల సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పరిశ్రమలో పెయింట్లు, రసాయనాలు, ద్రవ పదార్థాలు, కాగితపు నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మంటలు పక్కనున్న పరిశ్రమలకు వ్యాపించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఉన్న కార్మికులు అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రింటింగ్ యంత్రాలు, కాగితం, పెయింట్లు తదితర సామగ్రి దగ్ధమై భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. నష్టం విలువపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణమై ఉండొచ్చనే అనుమానంతో పాటు ఇతర కారణాలపైనా అధికారులు పరిశీలిస్తున్నారు. కూకట్పల్లి పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.