హైదరాబాద్, సెప్టెంబర్ 14 (సమాచార హక్కు): తెలంగాణలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ల (DCDRC) చైర్పర్సన్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వివరాలు కోరింది. నియామకాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ, సెలక్షన్ కమిటీ సిఫారసులు, ప్రభుత్వం ఇచ్చిన ఆమోదానికి సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కొంతమంది చైర్పర్సన్ల నియామకాలు నిర్దేశిత అర్హతలు, నిబంధనలకు అనుగుణంగా జరగలేదని పిటిషనర్లు ఆరోపించారు. ఈ ఆరోపణలకు మద్దతుగా RTI ద్వారా పొందిన సమాచారాన్ని కూడా కోర్టు ముందు ఉంచారు.
అయితే కేవలం RTI సమాధానాల్లో సమాచారం అందుబాటులో లేదని లేదా ఫైల్ కనిపించడం లేదని పేర్కొన్నంత మాత్రాన ఆ రికార్డు అసలు లేదని నిర్ధారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల సంబంధిత అసలు ప్రభుత్వ రికార్డులను పరిశీలించి స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఈ వ్యవహారం ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్న కోర్టు.. నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఇప్పటివరకు ఈ నియామకాలు చట్టబద్ధమా కాదా అనే తుది నిర్ణయాన్ని కోర్టు వెలువరించలేదు.


