బేగంపేట,సెప్టెంబర్ 11 (సమాచార హక్కు): మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన 254వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 101 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ శాఖకు 24, బీసీ సంక్షేమ శాఖకు 13, మున్సిపల్ శాఖకు 16, ఇతర శాఖలకు 48 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
సీఎం ప్రజావాణి ఇన్చార్జ్, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులకు దరఖాస్తులను పంపడంతో పాటు సమస్యల పరిష్కారంపై అధికారులతో మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ సలహా మండలి వైస్చైర్మన్ మంద భీంరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ప్రజా భవన్లో జరిగిన కార్యక్రమంలో గద్వాల్ విజయలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ పాల్గొన్నారు.


