RTIతో కీలక సమాచారం.. తొలగించిన పేర్లలో 91 శాతం తిరిగి ఓటర్ల జాబితాలోకి

కోల్కతా,సెప్టెంబర్ 11 (సమాచార హక్కు): పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై దాఖలైన అప్పీళ్లకు సంబంధించిన కీలక వివరాలు RTI ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల కమిషన్ నుంచి RTI కింద పొందిన సమాచార ప్రకారం, SIRకు సంబంధించిన అప్పీళ్లలో ఇప్పటివరకు పరిష్కరించిన కేసుల్లో 91 శాతానికి పైగా పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చారు.
ఆగస్టు 7 నాటికి అప్పీళ్ల ట్రిబ్యునళ్లు మొత్తం 82,782 అప్పీళ్లను పరిష్కరించగా.. వాటిలో 75,443 పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చారు. మరో 7,339 కేసుల్లో పేర్లను చేర్చేందుకు అనుమతి లభించలేదు. దీంతో పరిష్కరించిన అప్పీళ్లలో సుమారు 91.13 శాతం కేసుల్లో ఓటర్ల పేర్లు పునరుద్ధరించబడ్డాయి.
అయితే మొత్తం అప్పీళ్ల సంఖ్యతో పోలిస్తే పరిష్కారమైన కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. SIRకు సంబంధించి 38,10,620 అప్పీళ్లు దాఖలవగా, అందులో 37,27,838 అప్పీళ్లు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు RTI సమాధానంలో వెల్లడైంది. అంటే మొత్తం అప్పీళ్లలో దాదాపు 98 శాతం కేసులు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది.
ఈ గణాంకాలు పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై మరోసారి చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పరిష్కరించిన కేసుల్లో అధిక శాతం పేర్లు తిరిగి చేర్చబడటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో పెండింగ్లో ఉన్న లక్షలాది అప్పీళ్లను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరాలను కాంగ్రెస్ ఎంపీ ఇషా ఖాన్ చౌదరి దాఖలు చేసిన RTI దరఖాస్తుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాధానం ద్వారా పొందారు.