ఆన్లైన్లో అమ్మినా నిబంధనలు పాటించాల్సిందే : తుకారాం ముంఢే

ముంబై: ఆన్లైన్లో ఆహార పదార్థాలను విక్రయించి, డెలివరీ చేసే సంస్థలు కూడా ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముంఢే స్పష్టం చేశారు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు చట్టప్రకారం ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లేనని, అందువల్ల ఆహార నాణ్యత, పరిశుభ్రత, నిల్వ, తయారీ, ప్యాకేజింగ్ వంటి అంశాల్లో నిబంధనలు పాటించాల్సిన బాధ్యత వాటిపైనా ఉంటుందని తెలిపారు.
ఆన్లైన్లో ఆహార విక్రయాలు జరుగుతున్నాయనే కారణంతో నిబంధనల నుంచి మినహాయింపు ఉండదని ముంఢే స్పష్టం చేశారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన గోదాములు, డార్క్ స్టోర్లు, ఆహార నిల్వ కేంద్రాల్లోనూ FDA తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై లైసెన్స్ సస్పెన్షన్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇటీవల మహారాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆహారం నిల్వ చేసి డెలివరీ చేస్తున్న 86 కేంద్రాల్లో FDA తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలు కేంద్రాల్లో పరిశుభ్రత, నిల్వ విధానం, ఉష్ణోగ్రత నియంత్రణ, ఆహార పదార్థాలను నేలపై నిల్వ చేయడం వంటి లోపాలు గుర్తించడంతో చర్యలు చేపట్టింది.
రెస్టారెంట్లు, హోటళ్లు, తినుబండారాల కేంద్రాల్లో సాధారణంగా పరిశుభ్రత, తయారీ విధానాల ఉల్లంఘన, నాణ్యత లేని ముడి పదార్థాల వినియోగం, శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని ముంఢే తెలిపారు. ఆహార భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే FDA ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. “చట్టాన్ని పాటించని వారు వ్యాపారం చేయలేరు” అనే విధానంతో నిబంధనల అమలును కొనసాగిస్తామని తెలిపారు. వ్యక్తిగత ప్రచారం లేదా ప్రజాదరణ తన లక్ష్యం కాదని, ప్రజారోగ్య పరిరక్షణే తనకు ముఖ్యమని ముంఢే స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో ఆహార భద్రతా నిబంధనల అమలును మరింత కఠినతరం చేస్తూ FDA తనిఖీలు, చర్యలను కొనసాగిస్తోంది. ఆన్లైన్లో విక్రయించినా, నేరుగా విక్రయించినా ఆహార భద్రతా ప్రమాణాలు అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.